అమరావతి అభివృద్ధికి అంకురార్పణ

అమరావతి అభివృద్ధికి అంకురార్పణ

అమరావతి నిర్మాణంలో అత్యంత కీలక ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సింగపూర్‌ మధ్య కుదిరింది. అమరావతి డెవలప్‌మెంట్‌  పార్ట్‌నర్స్‌ (ఏడీపీ)కి క్యాపిటల్‌ రీజన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ  (సీఆర్‌డీఏ) మధ్య షేర్‌ హోల్డర్స్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నారు. అమరావతి ప్రాంతంలోని స్టార్టప్‌ ప్రాంతంలో సింగపూర్‌ కన్సార్టియం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలవుతుంది. వాటాదారులతో కుదిరిన ఒప్పందం ప్రకారం  ఈ ప్రాజెక్టులో సీఆర్‌డీఏకు 58 శాతం వాటా ఉంది. సింగపూర్‌ కన్సార్టియం, అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పరేషన్లు భాగస్వాములుగా ఉన్న అమరావతి డెవలప్‌మెంట్‌ పార్ట్‌నర్స్‌ (ఏడీపీ)కు 42 శాతం వాటా ఉంటుంది.
మరో ఒప్పందం
దీనితోపాటు సీఆర్‌డీఏకు సింగపూర్‌ అమరావతి ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ పీటీఈ లిమిటెడ్‌ల మధ్య మరో ఒప్పందం కుదిరింది. ఇది కన్సెషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌. ఇది కూడా స్టార్టప్‌ ఏరియాలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఉద్దేశించినది. స్టార్టప్‌ ఏరియాలలోని 1,611 ఎకరాల్లో అభివృద్ధి పనులు, భవనాల నిర్మాణాలు చేపడుతారు. ఇందులో 600 ఎకరాల్లో నిర్మాణాలను అయిదు సంవత్సరాల్లో పూర్తి చేస్తారు. మొత్తం ప్రాంతాన్ని 15 ఏళ్ళలో పూర్తి చేస్తారు. స్టార్టప్‌ ఏరియాలోని 45 ఎకరాల్లో సింగపూర్‌ కన్సార్టియం సొంతంగా ఐకానిక్‌ బల్డింగ్స్‌, ఆఫీసులను నిర్మిస్తుంది. మరోవైపు ఏడీపీ ఈ ప్రాంతంలో అవసరమైన మౌలిక సదుపాయాలను  ఏడీపీ చేపడుతుంది.
మూడవ సమావేశం
మూడవ జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశం తాజ్‌ గేట్‌ వే హోటల్‌లో జరిగింది. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ పాల్గొన్నారు. త్వరలోనే విజయవాడ నుంచి సింగపూర్‌ కు నేరుగా విమానం నడవనున్నట్లు ఈశ్వరన్‌ తెలిపారు. జూలై 8 నుంచి సింగపూర్ వరల్డ్ సిటీస్ సమ్మిట్ జరుగుతుందని అప్పట్లోగానే విజయవాడ నుంచి సింగపూర్ కు ఫ్లైట్లు నడుస్తాయని చంద్రబాబు చెప్పారు. అమరావతి అభివృద్ధికి అంతర్జాతీయ విమానాలు అత్యంత అవసరమని బాబు పేర్కొన్నారు.