హార్లిక్స్‌ వివాదంలో బిగ్‌ బి

హార్లిక్స్‌ వివాదంలో బిగ్‌ బి

బాలీవుడ్ షెహన్ షా.. అమితాబ్ బచ్చన్ పై విమర్శల వర్షం కురుస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ గ్లాక్సో స్మిత్  క్లెయిన్ తో ఆయన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. ఆరోగ్య పానీయాల తయారీకి పేరొందిన స్మిత్ క్లెయిన్ సంస్థ అమితాబ్ తో తన ఉత్పత్తులకు ప్రచారం చేయించుకొని బిగ్ బీని అభిమానించే కోట్లాది మందిని మోసం చేయడానికి పూనుకొందని అంటున్నారు. బచ్చన్ లాంటి పెద్దమనిషి దేశ ఆర్థిక వ్యవస్థను, పేద ప్రజలను బలహీనపరిచే ఇలాంటి కుట్రల్లో భాగస్వామి కాకూడదని బలంగా వాదిస్తున్నారు.

దేశంలో పోషకాహార లోపంపై పోరాడేందుకు తాను గ్లాక్సో స్మిత్ క్లెయిన్ సంస్థ ఉత్పత్తి చేసే ఆరోగ్య పానీయం.. హార్లిక్స్ కు ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్టు మే 30న అమితాబ్ బచ్చన్ మూడు ట్వీట్లు పెట్టారు. హార్లిక్స్ మిషన్ పోషణ్ తో పోషకాహార లోపంపై పోరాటంలో తను మొదటి అడుగు వేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆ ట్వీట్లలో ఆయన హార్లిక్స్, మీడియా గ్రూప్ నెట్ వర్క్18, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, భారత ప్రభుత్వ కార్యక్రమం పోషణ్ అభియాన్ లను ట్యాగ్ చేశారు.

ఈ ట్వీట్లు చూసిన పలువురు ఆరోగ్య నిపుణులు ఆయనను హార్లిక్స్ ప్రచారం నుంచి వైదొలగాలని సూచించారు. హార్లిక్స్ లో ఆరోగ్యానికి హాని కలిగించే మోతాదులో చక్కెర ఉంటుందని దీనితో టైప్2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. అమితాబ్ బచ్చన్ ప్రచారం చూసి నిరుపేదలు ఖరీదైన హార్లిక్స్ కొనుగోలు చేస్తే వారిపై ఆర్థిక భారం పెరిగిపోతుందని వారు వివరించారు. అదీ కాకుండా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పోషణ్ అభియాన్ తరహాలో మిషన్ పోషణ్ అని పేరుపెట్టి మేం దేశంలో పోషకాహార లోపంపై పోరాడతామని మిషన్ పోషణ్ నినాదంగా పెట్టడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. 

ఆరోగ్యానికి కలిగించే పదార్థాలు ఉన్నాయని అమితాబ్ 2014లో పెప్సీ తన వాణిజ్య ప్రకటనల ఒప్పందాన్ని రద్దు చేసుకొని సమాజం పట్ల బాధ్యత గల పౌరుడిగా తన నిజాయితీని రుజువు చేసుకొన్నారు. అదే విధంగా ఇప్పుడు కూడా బచ్చన్ హార్లిక్స్ తో అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంటారని ఆరోగ్య కార్యకర్తలు ఆశిస్తున్నారు.