రష్యా మిస్సైల్‌ సిస్టమ్‌ కొంటే...జాగ్రత్త

రష్యా మిస్సైల్‌ సిస్టమ్‌ కొంటే...జాగ్రత్త

రష్యా నుంచి అత్యాధునిక మిస్సైల్‌ సిస్టమ్‌ను కొనుగోలు చేయాలన్న భారత ప్రభుత్వ ప్రయత్నాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఆధునిక, సంక్లిష్టమైన మిస్సైల్‌ వ్యవస్థ ఎస్‌-400. ఈ ఆధునిక క్షిపణి వ్యవస్థ అయిన ఎస్‌-400ను కొనుగోలు చేయాలని భారత్‌ 2015లో నిర్ణయించింది.  మొత్తం 12 యూనిట్లు కొనుగోలు చేయాలని ప్రతిపాదించినా.. తరువాత 5 యూనిట్లకు పరిమితమైంది. డీల్‌ విలువ సుమారు రూ. 39,000 కోట్లు. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి ఈ డీల్‌ను పూర్తి చేయాలని మోడీ నిర్ణయించింది. అయితే రష్యాపై ఆంక్షలు విధించినా... భారత్‌ ఈ డీల్ కుదుర్చుకోవడంపై అమెరికా ఆగ్రహంతో ఉంది.  ఈ డీల్‌ కుదుర్చుకునే పక్షంలో మున్ముందు తమ దేశం నుంచి కొనుగోలు చేసే అత్యాధునిక ఆయుధాల నిర్వహణ కష్టమౌతుందని అమెరికా హౌస్‌ ఆర్మడ్‌ సర్వీసెస్‌ కమిటీ హెచ్చరించింది. 

ఎస్‌-400 డీల్‌కు సంబంధించి అమెరికా అధికార యంత్రాంగంతోపాటు కాంగ్రెస్‌ కూడా ఆందోళన చెందుతోందని కమిటీ ఛైర్మన్‌ మయాక్‌ థార్న్‌బెర్రి ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రికతో అన్నారు. ఎస్‌-400 కొనే పక్షంలో భవిష్యత్తులో అమెరికాతో సంయుక్తంగా నిర్వహించే సైనిక కార్యకలాపాలు సంక్లిష్టంగా మారుతాయనే అంశాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. మోడీ డీల్‌ ఖరారు చేసుకునే ముందు అన్ని అంశాలను పరిశీలిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఎస్‌-400 అంటే.. ఈ క్షిపణి వ్యవస్థను రష్యా  అభివృద్ధి చేసింది. ఒకేసారి నాలుగు మిస్సైల్స్‌ను ఉపయోగించడం దీని ప్రత్యేకత. 400 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణలు ఈ వ్యవస్థలో ఉన్నాయి. పైగా ఈ వ్యవస్థకు ఉన్న మరో ప్రత్యేకత 9ఎం 96ఈ2. సెకనుకు 5000 కి.మీ. లేదా గంటకు 18,500 కి.మీ వేగంతో  ప్రయాణిస్తుంది. అంతేగాకుండా...భూమిపై అతి తక్కువ ఎత్తులో అంటే 5మీటర్ల ఎత్తులోని లక్షాన్ని సైతం టార్గెట్‌ చేయగల శక్తి ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కు ఉంటుంది. ఎస్‌ 400ను రష్యా  అభివృద్ధి చేశాక.. అమెరికాతో పాటు నాటో దేశాలు ఒంటరిగా మారాయి. ఏ దేశంలోనూ ఇలాంటి ఆధునిక వ్యవస్థ లేదు. ఇపుడు భారత దేశం రష్యా నుంచి ఎస్‌ 400ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.