రాయుడు వచ్చేశాడు..

రాయుడు వచ్చేశాడు..

ఐపీఎల్‌లో అదరగొడుతున్న తెలుగు తేజం అంబటి రాయుడు.. మరోసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రెండేళ్ల క్రితం జాతీయ జట్టుకు ఆడిన రాయుడు అంతర్జాతీయ కెరీర్‌ ముగిసినట్టే అనుకుంటున్న తరుణంలో ఐపీఎల్‌లో సత్తాచాటడంతో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న రాయుడు.. పునరాగమనం ఖాయమని అభిమానులతోపాటు మాజీలు సైతం చెబుతూనే వస్తున్నారు. అందరూ అనుకున్నట్టుగానే సెలెక్టర్లు రాయుడుకు జాతీయ జట్టులో చోటిచ్చారు. 2013లో తొలిసారిగా టీమిండియాకు ఎంపికైన రాయుడు 34 వన్డేలు, 6 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించగా చివరి వన్డే 2016, జూన్‌లో ఆడాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో గత సీజన్‌ వరకు ముంబై ఇండియన్స్‌ తరఫున బరిలోకి దిగిన రాయుడిని ఈసారి ఆ జట్టు తప్పించింది. గతేడాది ముంబై ఇండియన్స్‌లో సరైనన్ని అవకాశాలు కూడా రాయుడికి లభించలేదు. దీంతో అతనిలో ఆత్మవిశ్వాసం దెబ్బతిని ఆట గాడి తప్పింది. అందుకే ఈ ఐపీఎల్‌ వేలంలో రాయుడికి డిమాండ్‌ కనిపించలేదు. చివరి నిమిషంలో చెన్నై జట్టు రాయుడి వైపు మొగ్గు చూపించింది. అంతేకాకుండా ఈ సీజన్‌లో రాయుడికి ప్రతి మ్యాచ్‌లోనూ ప్రధాన్యం కల్పించింది. టాప్‌ ఆర్డర్లో ఆడించింది. కావాల్సినంత ప్రోత్సాహం ఇచ్చింది. దీంతో.. తనేంటో నిరూపించుకునేందుకు రాయుడికి చక్కని అవకాశం దక్కింది. తనపై జట్టు ఉంచిన నమ్మకానికి న్యాయం చేస్తూ 'చెన్నై సూపర్‌ కింగ్‌'గా మారాడు.

తొలి మ్యాచ్‌ నుంచి మంచి స్కోర్లు సాధిస్తూ.. టోర్నీలో టాప్‌స్కోరర్‌గా దూసుకెళ్తున్నాడు. ఇప్పటి వరకు టోర్నీలో 10 ఇన్నింగ్స్‌ ఆడిన రాయుడు  423 పరుగులు చేశాడు. రెండు వారాల నుంచి 'ఆరెంజ్‌ క్యాప్‌'ను అట్టిపెట్టుకున్నాడు. ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉండడంతో ఇంగ్లండ్‌లో పర్యటించే జాతీయ జట్టులో రాయుడిని ఎంపిక చేశారు. ఏ స్థానంలోనైనా రాయుడు బ్యాటింగ్‌ చేయగలగడం రాయుడికి ప్లస్‌ పాయింట్‌. ఐపీఎలో ఫామ్‌నే అంతర్జాతీయ వేదికపైనా చూపించి టీమ్‌లో శాశ్వత స్థానం సంపాదిస్తాడని ఆశిద్దాం. ఆల్‌ ద బెస్ట్‌.. రాయుడు..