ఆరు నూరైనా...   అమరావతి ఆగదు...!

ఆరు నూరైనా...   అమరావతి ఆగదు...!

కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాజధాని అమరావతి పనులు ఆగవని తెలిపారు మంత్రి లోకేష్.  2019లోగా నగరానికి ఒక రూపం తీసుకొచ్చి తీరతామని స్పష్టం చేశారు. ఇప్పటికే 20 వేల కోట్ల విలువైన రోడ్లు, డ్రైనేజీ, కేబుల్, తాగునీరు, కనెక్టివిటీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. అధికారులు, సిబ్బంది, మంత్రులు, ప్రజాప్రతినిధుల నివాసాల నిర్మాణం చురుగ్గా సాగుతోందని తెలిపారు. పలు విద్యా సంస్థలు కూడా తరలి వస్తున్నాయని లోకేష్ స్పష్టం చేశారు. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్ట్, పరిపాలనా భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించినట్టు చెప్పారు. 

అమరావతి నిర్మాణం నత్తనడకన సాగుతోందన్న ఆరోపణలను లోకేష్ ఖండించారు. రాజధాని నిర్మాణానికి వ్యవసాయ భూములిచ్చేందుకు రైతులను ఒప్పించడం ఎంతో కష్టమైందని తెలిపారు. నగర నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ తయారు చేయడం, భవనాల డిజైన్లు ఖరారు చేయడం వంటివి ఆషామాషీ కాదన్నారు. కొత్తగా నిర్మించిన చత్తీస్ ఘడ్ రాజధాని నయా రాయ్ పూర్ నిర్మాణం ఒక రూపు రావడానికి 15 ఏళ్లకు పైగా సమయం పట్టిందన్నారు లోకేష్. పూర్తి స్థాయిలో రాజధాని నిర్మించేందుకు మరి కొన్నేళ్లు పట్టవచ్చని అన్నారు. 

కేంద్రానికి పదేపదే వినతులు చేసినా ఫలితం లేకపోయిందని విమర్శించారు. తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొన్నట్టు చెప్పారు. రాజధాని నిర్మాణానికి నిధులు పొందడం రాష్ట్ర హక్కని.. విభజన చట్టం ప్రకారం కేంద్రంతో పోరాడైనా సాధించి తీరతామని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణ పనుల్లో వేగం తగ్గకుండా  వివిధ మార్గాల్లో నిధులు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.  

ఈ నాలుగేళ్ల పరిపాలనలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ఆధారంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగనున్నట్టు లోకేష్ చెప్పారు. ముఖ్యంగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు తమ ప్రధాన ప్రచారాంశాలని తెలిపారు. తమకు ఏ పార్టీ పోటీ కాదని.. మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చేది ఖాయమని ఓ ఇంగ్లీషు పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.