ఇతనికి మతిస్థిమితం లేదు... వీరికి మతే లేదు...

ఇతనికి మతిస్థిమితం లేదు... వీరికి మతే లేదు...

మతిస్థిమితం లేని అమాయకుడిని చిత్రహింసలు పెట్టారు. చనిపోవడానికి ముందు నరకాన్ని చూపించారు. చనిపోతాడని తెలియగానే నిర్దాక్షిణ్యంగా నిర్మానుష్య ప్రాంతంలో అతడి ఖర్మానికొదిలేశారు. కనీసం చేతులకి కట్లు కూడా విప్పలేదు. పాపం.. దారీ తెన్నూ తెలియని ఆ వ్యక్తి అలా పాకుతూ అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. నానాహింసలతో అలసిసొలసిన ప్రాణాన్ని మండే ఎండలు తీశాయి. ఇదంతా హైదరాబాద్ మహానగర శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇంత అమానుషంగా ప్రవర్తించింది ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకొంటున్న తెలంగాణ పోలీసులు. మే 21న జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగానైనా వెలుగులోకి వచ్చింది. 

మే 20న మతిస్థిమితం లేని వ్యక్తి పెద్దగా కేకలు పెడుతూ తమపై దాడి చేయబోయాడు. వాట్సాప్‌లో వైరలైన పిల్లల కిడ్నాపర్ ఈ అనుమానాస్పద వ్యక్తే అనుకున్న స్థానికులు.. అతనిపై దాడి చేయబోయారు. కొందరు మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెట్రోలింగ్ సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకుని తమ పద్ధతిలో విచారించారు. పోలీసుల ఇంటరాగేషన్లోనూ ఆ వ్యక్తి పిచ్చి చేష్టలు చేశాడు. దీంతో ఓ మతిస్థిమితం లేని ఓ అమాయకుడిని తీసుకొచ్చామని అర్థమైన పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. తమ చేతికి మట్టి అంటకుండా వెంటనే అతడిని వేరేచోట వదిలి రావాలని వాళ్లు సూచించారు.

వెంటనే మఫ్టీలోని పోలీసులు ఓ కారులో అతడిని సంఘీ టెంపుల్ దగ్గరి అటవీ ప్రదేశంలో పడేసి పోయారు. అప్పుడు కూడా అతని చేతులను తాడుతో కట్టే ఉంచారు. ఇది చూసిన రంగయ్య అనే గొర్రెల కాపరి ఏదో కిడ్నాప్ వ్యవహారం అనుకొన్నాడు. చేతులకి కట్లతో పాకుతూ పోతున్న ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి అతని పరిస్థితి చూసి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ బ్లూ కోల్ట్స్ సిబ్బందికి సమాచారం అందించాడు. అప్పటికే అతను ఎండల కారణంగా ఆకలిదప్పులతో ఆరోగ్యం క్షీణించి స్పృహ తప్పి పడిపోయాడు. వారు అతడిని వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే ఆరోగ్యం క్షీణించిన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

మీర్‌పేట్ పోలీసులు అతడిని అలా వదిలేయకుండా ఆస్పత్రిలో చేర్పించి ఉంటే బతికేవాడని.. మానవత్వం మరిచి అమానుషంగా చేతులు కట్టేసి వదిలి వెళ్లడం వల్లే చనిపోయాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమగ్ర దర్యాప్తు జరిపిన అధికారులు పోలీసుల దుష్ప్రవర్తన నిజమని తేల్చి సీపీ మహేశ్‌ భగవత్‌కు నివేదిక అందించారు. 

ఓ అమాయకుడి మరణానికి కారకులైన మీర్‌పేట్ సబ్ ఇన్స్ పెక్టర్ మహ్మద్ మసీయుద్దీన్, వీ శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్‌ఐ చాంద్‌పాషా, హెడ్ కానిస్టేబుల్ సంజీవ్ రెడ్డిలను సీపీ సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. మరణించిన వ్యక్తి తమిళనాడుకి చెందినవాడని గుర్తించిన పోలీసులు అతని కుటుంబాన్ని పిలిపించి అంత్యక్రియలు పూర్తి చేశారు.