ఆధార్‌పై బిల్ గేట్స్ ప్రశంసలు...

ఆధార్‌పై బిల్ గేట్స్ ప్రశంసలు...

మొబైల్ సిమ్‌ నుంచి బ్యాంకు ఖాతాలు, గ్యాస్ కనెక్షన్, పాన్ కార్డు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు... ఇలా ఒక్కటేంటి... అన్నింటికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని విస్తృతంగా ప్రచారమైంది. అయితే కొన్నింటికి ఆధార్ అవసరం లేదని కోర్టు తీర్పు వెలువరించినా... ఆధార్ అనుసంధానం తప్పనిసరి అనే సంకేతాలే ప్రజల్లో ఉన్నాయి. ఇదంతా ఓ వైపు అయితే... మరోవైపు భారత్‌లో ఆధార్ ప్రైవసీ ఉందా? అనే చర్చ సాగుతోంది. ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు, వివిధ సంస్థలు కూడా ఆధార్ ప్రైవసీపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదంతా అలా ఉంటే ఆధార్ గుర్తింపు కార్డుపై ప్రశంసలు కురిపించారు బిల్ గేట్స్.

ఆధార్ గుర్తింపు కార్డు అద్భుతమని కొనియాడిన బిల్ గేట్స్... ఇతర దేశాల్లోనూ ఇలాంటి గుర్తింపు కార్డు ప్రవేశపెట్టాలంటూ ప్రపంచబ్యాంక్‌కు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి విరాళాలు కూడా ఇచ్చారాయన. ఆధార్‌తో చాలా లాభాలు ఉన్నాయని... ఇతర దేశాలు కూడా ఈ ఆధార్‌లాంటి కార్డులను జారీ చేయాలని సూచించిన బిల్ గేట్స్... ఏ ప్రభుత్వమైనా తమ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి, ప్రజలను శక్తివంతులను చేయడానికి నాణ్యమైన పాలన అవసరమని... దానికి ఆధార్ లాంటి వ్యవస్థ ఎంతో ఉపయోగకరమన్నారు. ఆధార్ ప్రైవసీపై స్పందించిన ఆయన... ఆధార్‌తో ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లదని... ఎందుకంటే ఇది కేవలం ఓ బయో ఐడీ వెరిఫికేషన్ స్కీమ్ మాత్రమే అని వెల్లడించారు.