స్పెషల్ స్టోరీ: ప్రేమతో మొదలైన పగ... చావుతో ముగిసిందా...? 

స్పెషల్ స్టోరీ: ప్రేమతో మొదలైన పగ... చావుతో ముగిసిందా...? 

ప్రేమ ... పగ... ఈ రెండు విరుద్ధ ధ్రువాలు.  రెండు ఎప్పుడు కలిసి ఉండలేవు.  ప్రేమ దక్కకపోతే అక్కడ పగ పెరుగుతుంది. ఒక్కోసారి ప్రేమ ఎక్కువైనా పగ పెరుగుతుంది.  మనం 21 వ శతాబ్దంలో ఉన్నాం.  రాకెట్లను నింగిలోకి పంపే టెక్నాలజీని సొంతం చేసుకొని గగనవీధుల్లో విహరిస్తున్నాం.  ఉన్నతమైన చదువును, సంస్కారాన్ని నేర్చుకున్నాం...కానీ ఒక్కోసారి ఎందుకో మనిషి తాను మనిషి అని మర్చిపోయి మృగంగా మారిపోతుంటాడు.  చేయరాని తప్పులు చేస్తుంటాడు.  

మత్తు వదిలి తిరిగి చూసే సరికి అంతా జరిగిపోయి ఉంటుంది.  అలా ఎందుకు చేశాను అని బాధపడిపోతుంటారు.  చేసిన తప్పుకు సరిదిద్దుకోవం మానేసి ఆవేశంతో జీవితాన్ని చిదిమేసుకుంటారు.  ఫలితంగా వాళ్ళను నమ్ముకొని ఉన్న కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది.  ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.  అలాంటి వాటిల్లో ఒకటి మారుతీరావు కథ.  

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి మారుతీరావు జీవితంలో ఏంతో ఎత్తుకు ఎదిగాడు.  ఎన్నో వ్యాపారాలు చేసి కావాల్సినంత సంపాదించాడు.  ఒక్కటే కూతురు.  ఆమెను చిన్నతనం నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు.  కూతురంటే ఆయనకు పిచ్చిప్రేమ. కానీ, ఆ ప్రేమే పగగా మారుతుందని కలలో కూడా ఊహించి ఉండడు.  కూతురు అమృత ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది.  

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తెలియకుండా వేరే క్యాస్ట్ వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంటే ఎవరికైనా కోపం వస్తుంది.  సహజం.  చంపేంత కోపం వస్తుందా అంటే... ఏమో చెప్పలేం.  మారుతి రావు విషయంలో అదే జరిగింది.  తన మాటకు ఎదురు చెప్పి పెళ్లి చేసుకుందనే కోపం కావొచ్చు... కూతురును తనను కాదని వెళ్లిపోయిందని కసి కావొచ్చు... ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకునేలా చేశాయి.  కూతురు భర్త ప్రణయ్ ను హత్య చేసేలా చేశాయి.  ఇది మారుతీరావు చేసిన పెద్ద తప్పు.  ఆ తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే.  

చట్టప్రకారంగా శిక్ష పడాలి.  ఎలాంటి శిక్ష పడినా దానికి ఎవరూ కాదనరు.  అప్పటి వరకు కూతురు అలా చేసిందనే కోపం ఉన్నది.  అందుకే అలా చేశాడు.  అలా చేయడానికి వెనకనుంచి ఎవరైనా ప్రోత్సహించి కూడా ఉండొచ్చు.  ఎందుకంటే స్థానికంగా మారుతిరావుకు మంచి పలుకుబడి ఉన్నది.  సమాజంలో పెద్దమనిషిగా ఉన్నాడు. ఆ పేరు చెడిపోతుందనే భయంతో కూడా అలా చేసి ఉండొచ్చు.  హత్య చేయడం నేరం కాబట్టి శిక్ష పడితీరాలి.  తప్పు తెలుసుకున్న మారుతీరావు తన కూతురితో రాజీ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు.  ఈ విషయాన్ని కూతురు కూడా అంగీకరించింది.  మారుతీరావు లాయర్ కూడా ఈ విషయాన్ని చెప్పిన సంగతి తెలిసిందే.  కూతరు ఇంటికి రానని చెప్పడం,,పోలీసులు ఛార్జ్ షీట్ రెడీ చేయడంతో, ఇతర ఒత్తిడులతో ఏం చేయాలో తెలియక, జీవితం వృధా అనుకున్నాడేమో, ఆత్మహత్య చేసుకున్నాడు. 

చనిపోయే ముందుకూడా సూసైడ్ నోట్ లో కూతురిపై ఉన్న ప్రేమను చూపించాడు. కూతురిపై అంతలా ప్రేమ ఉన్నప్పుడు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా కూతురు తిరిగివస్తుందని నమ్మి ఉండొచ్చు కదా.  చట్టప్రకారం శిక్ష అనుభవించి తిరిగి వస్తే తప్పకుండా కూతురు తిరిగి వస్తుందేమో కదా.  ఇలా ఆలోచించకుండా అయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్నది అందరి ముందున్న ప్రశ్న.  ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.