మహానాడుకు 34 తీర్మానాలు సిద్ధం

మహానాడుకు 34 తీర్మానాలు సిద్ధం

తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు వేదికగా చేసే తీర్మానాలు, జరపాల్సిన చర్చలపై ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఏపీ అభివృద్ధి, రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాలపై ప్రత్యేక ప్రస్తావన చేసేవిధంగా ప్రణాళికలు వేస్తున్న పార్టీ నేతలు... మొత్తం 34 తీర్మానాలు చేయనున్నారు. వీటిలో ఏపీకి సంబంధించినవి 22, తెలంగాణపై 8, ఉమ్మడి తీర్మానాలు నాలుగు ఉంటాయంటున్నారు నేతలు. ఇక చివరిరోజు మహానాడులో కీలక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే రాజకీయ తీర్మానంలో ప్రస్తావించే అంశాలపై గోప్యత పాటిస్తున్నారు. 

ఏపీలో ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలతో... కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, జాతీయ రాజకీయాలు, టీడీపీ విధానంపై ప్రత్యేకంగా ప్రస్తావన ఉండనుంది. జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ అవశ్యకతను రాజకీయ తీర్మానంలో పొందుపరిచే ఛాన్స్ ఉందంటున్నారు. రాష్ట్రం కోసం జాతీయస్థాయి రాజకీయం అనే పంతాలో రాజకీయ తీర్మానం రూపొందించే అవకాశం ఉంది. కాగా, రేపే మహానాడు ప్రారంభం కానుంది... టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా మే 27,28,29 తేదీలలో మూడు రోజులు జరిగే ఈ వేడుక మహానాడు-2018 పేరుతో విజయవాడ కానూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ ఆవరణలో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది తెలుగుదేశం పార్టీ.