ఐఐటీ జేఈఈ ఫలితాల్లో 'సూపర్'

ఐఐటీ జేఈఈ ఫలితాల్లో 'సూపర్'

ఐఐటీ జేఈఈ ఫలితాలు విడుదలైతే చాలు అందరి మదిలో మెదిలే సంస్థ 'సూపర్‌ 30' అకాడమీ. ఆనంద్‌కుమార్‌ నడుపుతున్న ఈ సంస్థ ఈ ఏడాది కూడా సూపర్‌ ఫలితాలు సాధించింది. ఈ సంస్థ నుంచి 30 మంది విద్యార్థులు శిక్షణ పొందితే.. 26 మంది ఈసారి అర్హత సాధించారు. ప్రతిభావంతులైన 30 మంది పేద విద్యార్థులకు ఆనంద్ కుమార్ ఏటా ఉచితంగా ఐఐటీ శిక్షణ ఇస్తున్నారు. 

ఎవరీ ఆనంద్‌కుమార్‌?
బిహార్‌లోని ఓ పేద కుటుంబంలో 1973లో జన్మించిన ఆనందకుమార్‌కు చిన్నప్పటి నుంచి లెక్కలంటే ఆసక్తి. లెక్కల్లో జీనియస్‌ అని చిన్నప్పుడే అందరిచేతా అనిపించుకున్నాడు. డిగ్రీ చదివేటప్పుడే 'నంబర్ థియరీ' మీద విదేశీ విద్యా సంస్థలకు జర్నల్స్ కూడా రాశాడు. ఇతని ప్రతిభను గుర్తించిన కేంబ్రిడ్జి యూనివర్సిటీ.. ఉన్నత చదువులు చదువుకునేందుకు 1994లో అవకాశం కల్పించింది. అప్పటికే తండ్రి మరణించడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. 


అదే స్ఫూర్తి..
ఉన్నత చదువులకు బ్రేక్ పడ్డాక.. పట్నాలో రామనుజం స్కూల్ ఆఫ్ మ్యాథమేటిక్స్ పేరుతో సంస్థ స్థాపించి విద్యార్థులకు లెక్కల పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. ఈ సంస్థ విజయవంతంగా నడుస్తుండగా అందులో చేరేందుకు 2000లో ఓ పేద విద్యర్థి వచ్చాడు. కానీ అతను ఫీజు చెల్లించలేని స్థితిలో ఉండడంతో ఉచితంగానే శిక్షణనిచ్చాడు ఆనంద్‌.. అప్పుడే ఆయన మదిలో 'సూపర్‌-30' ఆలోచన మెదిలింది. 


2002లో..
 పేదరికం కారణంగా ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదని భావించిన ఆనంద్‌.. అత్యంత పేదరికంలో మగ్గిపోతున్న 30 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఐఐటీ-జేఈఈ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించాడు. ఆ వెంటనే 2002లో 'సూపర్ 30'ని పాట్నాలో నెలకొల్పాడు. 30మంది పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ప్రారంభించాడు. ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించాడు. అలా ఆయన స్థాపించిన ఈ సంస్థ నూరు శాతం ఫలితాలు సాధిస్తోంది. సూపర్-30 స్థాపించిన 16 ఏళ్లలో సుమారు 480 మంది పేద విద్యార్థులను ఆనందకుమార్ శిక్షణనివ్వగా వారిలో 420 మంది ఐఐటీల్లో చదివేందుకు అర్హత సాధించారు.