ఆగని మృత్యుఘోష

ఆగని మృత్యుఘోష

గోరఖ్‌పూర్‌లోని భార్గవ్‌ దాస్‌ ఆస్పత్రి (బీఆర్‌డీ) ఆస్పత్రిలో మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. అరకొర వైద్య సదుపాయాలతోపాటు అవసరమైనంతమంది వైద్యులు లేకపోవడంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. గత 8 నెలల్లో ఇక్కడ 247 మంది చిన్నారులు మృతిచెందారు. దాదాపు 10 నెలల క్రితం ఈ ఆస్పత్రిలో కేవలం 48 గంటల వ్యవధిలో 30మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఎవరూ అంత తేలిగ్గా మరచిపోలేరు. పెద్ద ఎత్తున చిన్నారుల మరణాలు సంభవిస్తుండటంతో ప్రజాప్రతినిధులు, అధికారులు కొన్ని రోజులు హడావిడి చేసినా.. పరిస్థతిలో మార్పు రాలేదు.

సెప్టెంబర్‌లో 66 మంది, అక్టోబర్‌లో 77 మంది, నవంబర్‌లో 54 మంది, డిసెంబర్‌లో 36 మంది.. ఇలా మొత్తం 247 మంది చిన్నారులు మృత్యువాతపడడం.. పరిస్థతి తీవ్రతను చెబుతోంది. తల్లులకు పౌష్టికాహార లోపం వల్లే పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తున్నారని, ఇదే అనారోగ్య సమస్యలకు కారణమని, ఫలితంగా పుట్టిన గంటలోపే మరణిస్తున్నారని వైద్యులు చెబుతున్నా.. వాస్తవ పరిస్థతి మరోలా ఉంది. ఆస్పత్రిలో వనరులు తక్కువగా ఉండడంతో ఒక్కో బెడ్ పై ముగ్గురు చిన్నారులను, ఒక వెంటిలేటర్‌పై ఐదుగురు పిల్లలను ఉంచాల్సిన దుస్థతి నెలకొంది.

అలాగే.. ప్రతి రోజూ నాలుగు వేల మంది ఔట్ పేషంట్ విభాగంలో చికిత్స కోసం రావడంతో వైద్యులు చేతులెత్తేస్తున్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం రోగులు వైద్యుల నిష్పత్తి 10:1గా ఉంది. గత వర్షాకాలంలో మెదడు వాపు వ్యాధి లక్షణాలతో 1600 మంది చిన్నారులను ఆస్పత్రిలో చేర్పించగా వీరికి పరీక్షలు చేయడానికి కేవలం 9 మందే అందుబాటులో ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఇక్కడకి చికిత్స కోసం వస్తున్న రోగుల సంఖ్యను బట్టి చూస్తే మరో 20 మంది వైద్య నిపుణులను నియమించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నిస్తున్నా.. ఈ ఆస్పత్రిలో విధుల్లో చేరేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నారు.